చరిత్రలో మరో ఘట్టం.. ఫలించిన ఎంపీ ప్రయత్నాలు

విశాఖపట్నం: విశాఖ విమానయాన చరిత్రలో మరో గొప్ప ఘట్టం మొదలుకాబోతోంది. విశాఖ నుంచి కార్గో విమానం రాకపోకలు సాగించడానికి ఎట్టకేలకు రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. విశాఖ నుంచి ఈనెల 25 నాడు తొలిసారిగా కార్గో విమానం నడపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలిసారిగా విశాఖ నుంచి కార్గో విమానాలు చెన్నై, కోల్‌కొతా, సూరత్‌ తదితర ప్రాంతాలకు నడపడానికి స్పైస్‌ జెట్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. మరోవైపు ఆ సంస్థ కార్గో విమానాలు కొనసాగించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది.  ముందుగా అనుకున్న ప్రకారం ఈనెల 15 నుంచి కార్గో విమానాలు విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు నడవవలసి ఉంది. కాని రక్షణ శాఖ మోకాలడ్డడంతో కార్గో విమాన సర్వీసుల ప్రతిపాదనకు ఆటంకం ఎదురైంది.



విశాఖ నుంచి కార్గో విమాన సర్వీసులు ప్రారంభం కావాలని కొంతమంది వ్యాపారులు ఎప్పటినుంచో కోరుతున్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్‌  విమాన ప్రయాణికుల సంఘం వివిధ విమాన సంస్థల ప్రతినిధులతో చర్చించి ఒప్పించింది. అందులో భాగంగా ఈనెల 15 నుంచి స్పైస్‌ జెట్‌ ఆధ్వర్యంలో కార్గో విమానాల సర్వీసుల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. అయితే విశాఖలోని రక్షణ శాఖ అధికారుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. దీంతో కార్గో విమాన సర్వీసుకు బ్రేక్‌ పడింది. దాంతో కార్గో సర్వీసుల నిర్వహణపై స్పైస్‌ జెట్‌ సంస్థ రక్షణశాఖ అధికారులకు లేఖ లేఖ రాసింది. స్పైస్‌ జెట్‌ కోరిన సమయాలను కేటాయించలేమని రక్షణ శాఖ అధికారులు స్పైస్‌ జెట్‌కు లేఖ రాసినట్టు విమాన ప్రయాణికుల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈనెల 21న “సాక్షి’ పత్రికలో కార్గో సర్వీసుల ప్రతిపాదన నిలిచిపోయినట్టు వార్త వచ్చింది. దాంతో సమస్యను సంఘ ప్రతినిధులు కొందరు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ దృష్టికి తీసుకొని వెళ్లారు.