ఎవరు సొంత ప్రాంతాలకు రావొద్దు!

తాడేపల్లి: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న కారణంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి వస్తున్న వారిని సరిహద్దుల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. వారిని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. దీంతో అంతరాష్ట్ర సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే అంతరాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఏపీ వారికోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎంవో అడిషనల్ చీఫ్ సెక్రెటరీ డాక్టర్ పీవీ రమేష్ తెలిపారు. 




ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దీనిపై పూర్తి స్థాయిలో సమీక్షిస్తున్నారన్నారు. దయచేసి ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడ వారు అక్కడే ఉండండి. ఎవరూ సొంత ప్రాంతాలకు రావాలని ప్రయత్నించవద్దు. అది మీకు, మీ కుటుంబ సభ్యులకు, ప్రజలకు ఇబ్బంది కలిగించవచ్చు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించారు. సతీష్ చంద్ర, పీయూష్ కుమార్ లను ఈ వ్యవహారాల కోసం సీఎం నియమించారు. దయచేసి ఎవరు సొంత ప్రాంతాలకు రావద్దని సీఎం ప్రత్యేకంగా కోరారు’ అని ఆయన తెలిపారు.