న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి లాక్‌డౌన్ అమలవుతున్న క్రమంలో థర్డ్ పార్టీ వాహన, ఆరోగ్య బీమా పాలసీదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. ఆయా బీమా పాలసీల గడువును మే 15వరకూ పొడిగించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రేస్ పిరియడ్‌లో బీమాదారులకు బీమా కవరేజ్‌తో పాటు క్లెయిమ్స్‌ను పరిష్కరించాలని బీమా కంపెనీలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది.
మార్చి 25 నుంచి మే 3 మధ్య గడువు ముగియనున్న థర్డ్‌పార్టీ వాహన, ఆరోగ్య పాలసీలకు ఈ వెసులుబాటును వర్తింపచేస్తారు. కాగా ఏప్రిల్ 14 వరకూ విధించిన తొలి విడత లాక్‌డౌన్ సందర్భంగా కూడా పాలసీ పునరుద్ధరణ గడువును పొడిగిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. వాహన, బీమా పాలసీల పునరుద్ధరణ గడువును పొడిగిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్ చేసిన క్రమంలో అందుకు అనుగుణంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.